కొవ్యాక్సిన్ మూడో దశ ఫలితాల్లో కరోనాపై కొవాగ్జిన్‌ 77.8 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. - Narada News Telugu

Kalahamsa
0

హైదరాబాద్‌: కరోనాపై కొవాగ్జిన్‌ టీకా 77.8 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఈ మేరకు కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను విడుదల చేసింది. కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో కొవాగ్జిన్‌ టీకా 93.4 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. తీవ్ర లక్షణాలు నిలువరించి ఆస్పత్రిలో చేరే అవసరాన్ని కొవాగ్జిన్‌ తగ్గిస్తోందని వివరించారు.

18-98 ఏళ్ల మధ్య వయసు ఉండి మొత్తం 130 మంది కొవిడ్‌ లక్షణాలున్న వారిపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్‌ బయోటెక్ వెల్లడించింది. వీరిలో 12 శాతం మందిలో సాధారణ దుష్ప్రభావాలు, 0.5 శాతం మందిలో తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తినట్లు పేర్కొంది. ఇతర కరోనా టీకాలతో పోల్చి చూస్తే కొవాగ్జిన్ వల్ల తలెత్తిన దుష్ప్రభావాలు చాలా తక్కువని తెలిపింది.

భారతదేశంలో ఇప్పటివరకు అతిపెద్ద కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించడం ద్వారా కొవాగ్జిన్‌ సామర్థ్యం, భద్రతను ధ్రువీకరించినట్లు భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. దీంతో భారత్‌, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఆవిష్కరణలు, నవీన ఉత్పత్తుల అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. ప్రపంచ జనాభా రక్షణకు భారత ఆవిష్కరణలు అందుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.

ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ మాట్లాడుతూ.. ‘‘విజయవంతంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ భారతీయ విద్యా, పరిశ్రమల స్థానాన్ని పదిలం చేసింది’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌, బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌, ఇరాన్‌, మెక్సికో సహా మొత్తం 16 దేశాల్లో కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి అత్యవసర అనుమతులు లభించినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. మరోవైపు అత్యవసర వినియోగ కరోనా టీకాల జాబితాలో కొవాగ్జిన్‌ను కూడా చేర్చే ప్రక్రియపై డబ్ల్యూహెచ్‌ఓతో సంస్థ చర్చలు జరుపుతోంది.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top